క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి?

 


సాధారణంగా సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేసేవాళ్ళకి, ఇంకా ఇంటర్నెట్-కంప్యూటర్ వాడేవారు రోజూ క్లౌడ్ కంప్యూటింగ్ లేదా క్లౌడ్ అనే పదాన్ని వింటూనే ఉంటారు.  వారిలో చాలామందికి క్లౌడ్  గురించి అవగాహన బాగానే ఉంటుంది. ఐతే కొత్తగా సాఫ్ట్ వేర్ రంగంలోకి అడుగుపెట్టే వారికి  క్లౌడ్ కంప్యూటింగ్ మీద అవగాహన తక్కువగా ఉంటుంది .వారి అవగాహన కొసమే ఈ చిన్ని ప్రయత్నం.


మనం సాధారణంగా మన ఫైల్స్, ఫొటొలు గాని  మన కంప్యూటర్లోనో, లేదా ఏ పెన్‍డ్రైవులోనో సేవ్ చేసుకోవడం మనకలవాటు.   కాని అవి ఎప్పుడు పడితే అప్పుడు మనకు అందుబాటులొ ఉండాలంటే కొంచెం కష్టం.అయితే టెక్నాలజి మెరుగవుతున్నకొద్దీ గూగుల్ డ్రైవ్ లాంటి సెర్వీసులు అందుబాటులోకి వచ్చాక చాలా వరకూ కంప్యూటర్ లో సేవ్  చేయబడే ఫైల్స్, ఫొటొలు నుండీ వీడియోల వరకూ ఈ సేవల ద్వారా ఇంటర్నెట్లో సేవ్ చేయబడి  ఆపై షేర్ చెసుకొవడం , మరో చోటు నుండీ వీటిని పొందటం చాలా సులభం అయిపోయింది. స్మార్ట్ ఫోన్ ల సహాయం తొ కూడా ఈ స్టోర్డ్ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. ఆఖరికి  ఎక్కడైనా నెట్ సెంటర్ నుంచి కూడా వీటిని యాక్సెస్ చేసుకునే అవకాశం మనకి వచ్చింది.




కంప్యూటరులో సేవ్ చేసిన ఫైల్స్ ఏ విదంగా ఐనా పాడయ్యె అవకాశం ఉంది.. వైరస్ ఎటాక్ అవ్వవచ్చు లేక హార్ద్-డిస్కే క్రాష్ అవ్వవచ్చు, పొరపాటున డిలీట్ అయిపోవచ్చు. అందువలన ఇంటర్ నెట్ బేస్డ్  సేవింగ్ సెర్వీసెస్ ని వాడడం ద్వారా ఈ ప్రమాదం నుంచి సేవ్ కావచ్చు.. దీనినే ఇంటర్నెట్ బేస్డ్ క్లౌడ్ స్టోరేజ్ అంటాం.


సాధారణంగా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? అని గనుక ఎవరైనా స్నేహితులను గానీ, పెద్దవాళ్ళనిగానీ అడిగితే, "క్లౌడ్‌ కంప్యూటింగ్‌'తో డేటా మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనే సేవ్ చేసుకుని ఎక్కడైనా వాడుకోవచ్చు.... " అనే భావన కలిగే సమాధానం వస్తుంది..   కానీ మరింత లోతుగా ఇంటర్నెట్ లో వెతికినా, లేక అధ్యయనం చేస్తే  మరిన్ని విషయాలు తెలుస్తాయి.


ఇప్పుడీ క్లౌడ్ అంటే ఏమిటో చూద్దాం.


చాలాసార్లు మనకి తెలియకుండానే మనం క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసుల్ని వాడుతున్నాం. సోషల్ నెట్-వర్కింగ్ సర్వీసులు పూర్తిస్థాయిలో అందరికీ అందుబాటులోకి వచ్చాక ఫేస్‍బుక్, ఇన్స్టాగ్రామ్  గూగుల్ డ్రైవ్ లాంటి సైట్ లలో ఫొటోలు అప్-లోడ్ చెయ్యడం/డౌన్-లోడ్, షేర్  చెయ్యడం మనకి సాధారణం ఐపోయింది .   ఈ ఫైల్స్ ఇంటర్నెట్ కి కనెక్ట్  ఉన్న ఏ కంప్యూటరు లేదా స్మార్ట్‍ఫోన్ ద్వారానో మీరు పొందవచ్చు. ఎందుకంటే ఈ ఫైల్స్  రియల్ గా డేటా సెంటర్ అనబడే ఒక కంప్యూటర్ వేర్ హౌస్ లో సేవ్  చెయ్యబడి ఉంటాయి. 




ఈ డేటా-సెంటర్లలో అనేక వేల సర్వర్లు ఒక పద్ధతిలో అమర్చబడి ఉంటాయి. చాలా సార్లు మన ఫోన్ కెమెరాతో తీసుకున్న ఫొటోలు కూడా మన ఫోనులో ఉండే సర్వీసుల ద్వారా ఆటోమెటిక్ గా ఈ సర్వర్లలోకి చేరి (చాలావరకూ వీటి నియంత్రణ మన చేతుల్లోనే ఉంటుంది, కానీ ఈ సర్వీసులమీద మనలో చాలా మందికి అవగాహన తక్కువగా ఉండడం వల్ల మిస్-యూస్ అయ్యే అవకాశం ఉంది), మనకి ఎప్పుడు కావాలంటే, అప్పుడు అందుబాటులో ఉంటాయి.ఇలా ఒక ఫైల్  ప్రపంచంలో అనేక డేటా సెంటర్లలో సేవ్  చేసి ఉంటుంది. ఒక డేటా సెంటర్ ఎదైనా కారణం చేత డౌన్ అయినా, లేక ప్రకృతి వైపరీత్యాల వల్ల ధ్వంసమైనా వేరొక డేటా సెంటర్ల ఉన్న కాపీ ద్వారా, మన డేటాని తిరిగి పొందవచ్చు.   



                                 "పాలు తాగాలంటే ఆవుని కొనవలసిన అవసరంలేదు "


ఆవు కొనవలసిన అవసరం లేకుండానే ,అది ఉన్న వ్యక్తి వద్దకి మనం వెళ్ళి మనకి అవసరమైనన్ని పాలు కొనుక్కొవచ్చు.


క్లౌడ్ కంప్యూటింగ్ కి సరిగ్గా సరిపొయే మాటయిది. ఈ సూత్రం ప్రకారమే క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థ పని చేస్తుంది...


సాధారణ యూజర్ల (end user) గురించి కొంచెంసేపు పక్కన పెడదాం. ఐటి రంగంలో ఉండే వారు, ప్రతీ రోజూ తమ సాధారణ వర్క్ లో భాగం గా అనేక సర్వీసులను వాడుతూ ఉంటారు. డేటా స్టోరేజ్ కోసం కొన్ని రకాల సర్వర్లను, వారు తయారు చేసిన రకరకాల సాఫ్ట్ వేర్లను(ఉదాహరణకు వెబ్-సైట్లు) యూజర్లకి అందుబాటులోకి తేవడానికి కొన్ని రకాల సర్వలను, డేటా-బేస్ అవసరాల కోసం SQL server, MySQL, etc.. వంటి సాఫ్ట్ వేర్లను వాడుతూ ఉంటారు.   వారికి కావలసిన రకరకల సర్వర్లను, లేక డేటా-బేస్ (SQL server, MySQL, etc.. ) లాంటి  సర్వీసుల్ని సమకూర్చడానికి, వాటి లైసెన్సులను తీసుకోవడానికి, పూర్తి సెక్యూరిటీతో కూడిన సర్వర్లను రూపొందించుకోవడానికి,  సాఫ్ట్వేర్ కంపెనీలు వేల నుండి, లక్షల, కొన్నిసార్లు  కోట్ల రూపాయల దాకా ఖర్చు పెడుతూ ఉంటాయి.  వీటిలో చాలా వరకూ కాలం గడిచేకొద్దీ వాటివిలువను కోల్పోతూ ఉంటాయి. ఉదాహరణకు, ఇవాళ ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి, మంచి సెక్యూరిటీ, విలువ, సామర్ధ్యం కలిగిన మంచి సర్వర్ ని కొన్నాము అనుకోండి, ఒక రెండు సంవత్సరాల తర్వాత, దీని కంటే మంచి సెక్యూరిటి లేక సామర్ధ్యం కలిగిన సర్వర్ మార్కెట్ లోకి అందుబాటులోకి రావచ్చు, లేకపోతే, ఆ రెండు సంవత్సరాల తర్వాత మనకే మరింత సామర్ధ్యం కలిగిన సర్వర్ అవసరం కలుగవచ్చు. అప్పుడు మన పాత సర్వర్ ని వదిలించుకోవడం అనేది ఆర్ధికంగా నష్టాన్ని కలిగించడమే కాక, దాని స్థానంలో కొత్తదానిని తెచ్చుకోవడం మరింత ఖర్చుతో కూడుకున్నదై ఉంటుంది.  


అటువంటప్పుడు, మనం కొనడం అనే పనిని పక్కన పెట్టి, క్లౌడ్ ని ఆశ్రయిస్తే, మనకి కావలసిన సర్వర్లను, క్లౌడ్ సర్వీసు అందించే కంపెనీల వెబ్సైటు లోకి వెళ్ళి, వారు అడిగిన సమాచారం అందించి,  అకౌంటు క్రియేట్ చేసుకుని, తర్వాత కేవలం కొన్ని క్లిక్స్ ద్వారా మనకి కావలసిన సర్వర్లను పొందవచ్చు.  

సర్వర్ క్రియేట్ చేసినప్పటి నుండి, ప్రతినెలా, మనం ఎన్ని గంటలు ఆ సర్వర్ని వాడుకున్నాము అన్నదాని ప్రకారం డబ్బు చెల్లించవచ్చు. మనకి అవసరంలేనపుడు, ఆ సర్వర్ని ఆపివేయడం ద్వారా చాలా వరకూ బిల్ ఆదా చేసుకోవచ్చు. సాధారణంగా, మనం ఎంపిక చేసుకున్న సర్వర్ సామర్ధ్యం ప్రకారం గంటకి ఇంత అని సర్వీసు ప్రొవైడర్లు డబ్బు వసూలు చేస్తారు. ఒక విధంగా చూస్తే, ఇది మన ఇంటికి అద్దె చెల్లించడం వంటిదే, కాకపోతే అక్కడ పూర్తి నెలకి అద్దె చెల్లించితే, ఇక్కడ నెలలో ఎన్నిగంటలు ఆ సర్వర్ని వాడుకుంటే, అన్ని గంటలకే డబ్బు చెల్లించాలి. అయితే దీనికోసం ఆ ప్రొవైడరుతో మనం ముందుగా ఏవిధమైన ముందస్తు ఒప్పందం చేసుకోవలసిన అవసరం లేదు.  ఉదాహరణకు, మనం ఒకటవ తారీఖున ఒక సర్వర్ని లాంచ్ చేసాము, రోజుకి పది గంటల చొప్పున వాడుకుంటూ, మిగిలిన సమయాలలో ఆఫ్ చేసేస్తున్నాము అనుకోండి, అప్పుడు 10x30=300 గంటలకి మాత్రమే మనం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో మన సర్వర్ సామర్ధ్యాన్ని పెంచుకోవాలంటే, చాలా సులభంగా, చేసుకోవచ్చు. పాత సర్వర్ గురించి మనం ఆలోచించ వలసిన అవసరమే ఉండదు.   

నిస్సందేహంగా క్లౌడ్ అనేది గొప్ప సర్వీసు. అందులో, మరొక మాటకి తావులేదు. అయితే నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే, ప్రతీ గొప్ప ఆవిష్కరణలోనూ లాభనష్టాలు ఉంటాయి. అలాగే క్లౌడ్ సర్వీసుల్లో అన్నీ లాభాలేకాదు, కొన్ని నష్టభయాలు కూడా ఉన్నాయి. మనం ఇప్పటి వరకూ లాభాలే మాట్లాడుకున్నాము కనుక, ఇప్పుడు కొన్ని నష్టాలు లేక పరిమితుల గురించి కూడా చూద్దాం.



సాధారణంగా మనం వాడుకునే క్లౌడ్ సర్వీసుల రక్షణ బాధ్యత, కొంతవరకూ ఆ క్లౌడ్ ప్రొవైడరే చూసుకుంటాడు. మనం కూడా వారు ప్రొవైడ్ చేసే కొన్ని సర్వీసులద్వారా, మరింత సెక్యూరిటీని సెట్ చేసుకోవచ్చు. కాకపోతే, మనం ఊహించలేని స్థాయిలో హాకింగ్ వంటి దాడులు జరిగినప్పుడు, ఆ సర్వీసులని వాడుకునే అందరు యూజర్ల లాగానే మన డేటా కూడా ప్రమాదంలో పడవచ్చు. 

క్లౌడ్ సర్వీసులని వాడుకోవడం అంటే, ఒక అపార్టుమెంటులో ఫ్లాటు కొనుక్కోవడం లాంటిదే. ఎంతో డబ్బుపోసి కొనుక్కుంటాం, ఫ్లాటంతా మనదే అనిపిస్తుంది, కానీ ఎన్నో పరిమితులు ఉంటాయి.  గోడలు మనవే, కానీ మేకు కూడా దింపకూడదు. ఫ్లోర్ మనదే కానీ పిల్లలు గట్టిగా గంతులు వేస్తే,కింది ఫ్లాటు వాళ్ళు వచ్చి గొడవ చెయ్యవచ్చు. అలాగే క్లౌడ్ లో కూడా సర్వర్ మనదే, కానీ అద్దె చెల్లించినంత కాలమే అది మన సొంతం. మనకు కావలసిన సామర్ధ్యం ఉన్న సర్వీసులను సెలెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. కానీ, వాటి పనితీరు ప్రొవైడర్ అందించే పరిమితులకి లోబడి ఉంటుంది.



ఇలా అనేక విషయలు చెప్పుకోవచ్చు. అయితే, కొన్ని నష్టాలు ఉన్నా, ఈ రోజు ఎన్నో కంపెనీలు, తమ కొత్త ఉత్పత్తులను క్లౌడ్ సర్వీసుల ద్వారా రూపొందించడానికి, లేక అప్పటికే రిలీజ్ చేసిన ఉత్పత్తులని క్లౌడ్ లోకి మార్చుకోవడనికి ఆసక్తి చూపుతున్నాయి. దానికి అనేక కారణాలు. వాటిగురించి మనం మరొక వ్యాసంలో మాట్లాడుకుందాం.

4 comments: