AWS - Azure - GCP వీటిలో ఏది నేర్చుకోవడం ఈజీ? దేనికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి?
క్లౌడ్ కంప్యూటింగ్, .....
............దాదాపు 15 సంవత్సరాలక్రితమే మొదలయ్యి, సాఫ్ట్వేర్ కంపెనీలకి అవసరమైన రకరకాల సేవలతో, ఐటి మార్కెట్ లోకి విస్తరిస్తున్న ఒక ఇంటర్నెట్ ఆధారిత సర్వీసు. దీనిని మొదలుపెట్టింది, బిజినెస్ మోడల్ గా ముందుకు తీసుకునివచ్చింది Amazon company వాళ్ళయితే, తర్వాతి రోజుల్లో దీని కెపాసిటీని అర్ధం చేసుకున్న ఎన్నో అంతర్జాతీయ, దేశవాళీ కార్పోరేట్ కంపెనీలు తమ సేవలను క్లౌడ్ దిశగా మార్చుకుని విజయం సాధించాయి, సాధిస్తున్నాయి కూడా.
ఈరోజున మార్కెట్ లో చూసుకుంటే, అంతర్జాతీయ దిగ్గజాలయిన "అమెజాన్ వెబ్ సర్వీసెస్(AWS)" అనేపేరుతో అమెజాన్ కంపెనీ వాళ్ళు, "అజూర్" అనే పేరుతో మైక్రోసాఫ్ట్ వాళ్ళు, "గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫాం" అంటూ గూగుల్ కంపెనీ మనకి క్లౌడ్ సేవలను అందిస్తున్నాయి.
అసలు క్లౌడ్ కంప్యూటింగ్ చరిత్రను ఒకసారి గమనిస్తే, ఈ విధమైన సర్వీసు గురించి ఆలోచనలు మనకి 1960 ల్లోనే కనపడతాయి. అయితే అప్పటికి ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడం, ఐటి సేవలు కూడ పరిమితంగానే అందుబాటులో ఉండడం వల్ల, దానికి అంత ప్రాచుర్యం రాలేదు. అయితే 2000 సంవర్సరం నాటికి క్లౌడ్ కంప్యూటింగ్ గురించిన చర్చల్లో పురోగతి వచ్చింది. అయితే వీటిపై అయితే మరీ అంత అభివృద్ధి కనిపించదు. దానికి కారణం ఆ రంగం మీద అప్పట్లో ఎవరికీ పెద్దగా అంచనాలు లేకపోవడమే. అటువంటి సమయంలో అమెజాన్ రంగప్రవేశం చేసింది.
అసలు క్లౌడ్ అంటే ఏంటి? ఇటువంటి సర్వీసులు అందించడం సాధ్యమా?? అని అలోచించే కాలంలోనే, క్లౌడ్ సేవలను ఖచ్చితంగా అందించవచ్చు అని బలంగా నమ్మి, 2004 లోనే మార్కెట్ లోకి మొదటి అడుగు పెట్టడం(early bird), వారు అందించే సర్వీసుల్లో ఉండే ఒక విధమైన సరళత (easiness), ఇంకా వారి సర్వీసుల గురించి చదివి అర్ధం చేసుకోవడానికి వారు ప్రొవైడ్ చేసే పూర్తి information తో ఉండే documents కారణంగా అమేజాన్ కి క్లౌడ్ మార్కెట్ లో అగ్రస్థానం దక్కింది.
నిజానికి 2004 లో క్లౌడ్ మర్కెట్ లో అమెజాన్ తొలి అడుగు కొంతవరకూ ఫెయిల్ గానే భావించవచ్చు. ఎందుకంటే, 2004 లో మొదటిసారి వ్యాపారపరంగా మార్కెట్ లోకి అదుగుపెట్టగానే వారికి ఎన్నో ప్రాక్టికల్ ప్రాబ్లంస్ ఎదురయ్యాయి. అవి ఒకింత పెద్దవే కావడంతో, తమ సర్వీసులకి తాత్కాలికంగా విరామం ఇచ్చింది company. కానీ పట్టు విడవకుండా తమలోపాలని సరిదిద్దుకుని మళ్ళీ 2006 లో మార్కేట్లోకి రీ-ఎంట్రీ ఇచ్చి, ఇప్పటివరకూ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అమెజాన్ తర్వాత వాటిల్లో ముఖ్యమైనవి ఏవి ఉన్నాయి అనిచూస్తే,Azure (Microsoft), GCP(Google), Salesforce, IBM Cloud, Oracle Cloud, Alibaba Cloud వంటి ఎన్నో కార్పోరేట్ కంపెనీలు మనకి కనిపిస్తాయి.
2006 లో AWS లోకి రి-ఎంట్రి ఇచ్చి నిలదొక్కుకోగా, అప్పటికి 2 సంవత్సరాల తర్వాత అంటే 2008 లో గూగుల్ "GCP" అనేపేరుతో, 2010 లో మైక్రోసాఫ్ట్ "అజూర్" అనే పేరుతో క్లౌడ్ ఎంట్రీ ఇచ్చాయి. కొద్దిపాటి ఆలస్యంగానైన ఈ కంపెనీలు క్లౌడ్ మార్కెట్ లో ఉండే అవకాశాలను అర్ధంచేసుకోగలిగాయి"క్లౌడ్ మార్కెట్ అభివృద్ధిని అంచనా వెయ్యడంలో మేము పొరపడ్డాము, అందుకే ఈ రంగంలో మేము వెనుకపడ్డాము" అని మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ళ ఒక దశలో వ్యాఖానించారంటేనే ఈ రంగంలో ఉన్న అవకాశాలను మనం అర్ధం చేసుకోవచ్చు.
అయితే ఒకసారి వాణిజ్యపరంగా క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాముఖ్యత, అవకాశాలను అర్ధంచేసుకున్న వెంటనే ఎన్నో కార్పోరేట్ కంపెనీలు తమ ఉత్పత్తులను క్లౌడ్ దిశగా నడిపించాయి, వాటికంటూ మార్కెట్ ని సృష్టించుకున్నాయి కూడా.
ఈనాడు మన భారతదేశంలోనే ఎన్నో లక్షల మందికి ఉపాధిని కల్పించే దిశగా క్లౌడ్ రంగం రూపు దిద్దుకుంటోంది. చాలామంది విద్యార్ధులు, కాలేజ్ దశలోనే, ఈ టెక్నాలజీని నేర్చుకుంటూ, భవిష్యత్తులో రాబోయే అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధం అవుతున్నారు.
వీరిలో మెజారిటీ విద్యార్ధులకి తమకి ఏంకావాలి(?) అన్నదానిమీద ఒక అవగాహన ఉంటోంది. మరికొంతమందికి మాత్రం, ఏం నేర్చుకోవాలి అన్నదానిమీద ఒక క్లారిటీ ఉనడంలేదు. అసలు ఏ క్లౌడ్ నేర్చుకోవాలి? అన్న బేసిక్ క్వశ్చన్ దగ్గరే ఆగిపోతున్నారు. వారికి సమాధానం చెప్పడానికే ఈ వ్యాసం.
******************************************
చాలా మంది స్టూడెంట్స్, సాధారణంగా అడిగే ప్రశ్న.
AWS - Azure - GCP వీటిలో ఏది నేర్చుకోవడం ఈజీ? దేనికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి?
చాలామంది ట్రైనర్లకి కూడ వాళ్ళ స్టూడెంట్స్ నుండి వచ్చే ప్రశ్న ఇదే అవ్వవచ్చు.
దీనికి సమాధానం చెప్పేముందు, క్లౌడ్ గురించి మరికొంచెం మాట్లాడుకుందాం.
సాధారణంగా IT field లో ఒక ప్రొడక్ట్ ని తయారుచేసి దానిని మార్కెట్ లోకి విడుదల చేసే క్రమంలో వివిధ సాఫ్ట్వేర్ ఉత్పత్తులని వాడుకుంటూ ఉంటాము. ఉదాహరణకి వెబ్ అప్లికేషన్లను హోస్ట్ చెయ్యడానికి వెబ్ సర్వర్లు, డేటా బేస్ ఉపయోగించుకోవడనికి కొన్ని సర్వర్లు, ఇంకా కొన్నిరకాల ఫైల్స్ ని సేవ్ చెయ్యడానికి కొన్ని రకాల సర్వర్లని ఉపయోగిస్తూ ఉంటారు.
ఇక్కడ ఎప్పుడైతే క్లౌడ్ అనే పాత్ర ప్రవేశించిందో, ఇన్ని రకాల సర్వర్లను పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. వెబ్ అప్లికేషన్లను హోస్ట్ చెయ్యడానికి సర్వర్ అవసరమవుతుంది అనుకుంటే, దానికి క్లౌడ్ లోనే సర్వీసులు ఉంటాయి. అలాగే, డేటాబేస్ కోసం కొన్ని సర్వీసులు, ఫైల్స్ స్టొర్ చెయ్యడానికి మరికొన్ని సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అది ఏరకమైన క్లౌడ్ సర్వీసయినా మనకి అవసరమయ్యే ప్రతి ఐటి అవసరానికి క్లౌడ్ లో సొల్యూషన్ ఉంటుంది.
మనం ఒక వెబ్ అప్లికేషన్ తయారు చేశాము. దానిని సాధారణ ప్రజలకి అందుబాటులో ఉంచాలి అనుకోండి. అప్పుడు మనకి పబ్లిక్ యాక్సిస్ పర్మిషన్ ఉన్న ఒక సర్వర్ మనకి కావాలి. మన వెబ్ అప్లికేషన్ ని అందులో ఇన్స్టాల్(host) చేస్తే అప్పుడు మన అప్లికేషన్ ని బ్రౌజర్ ద్వారా అందరూ ఉపయోగించుకోగలరు.
పబ్లిక్ యాక్సిస్ సర్వర్ కావాలంటే, AWS లో మనకి Elastic compute cloud (EC2) అనేపేరుతో సర్వీస్ లభిస్తుంది. ఇటువంటి సర్వీస్ కోసమే Azure లో వెతికితే Virtual machine అనేపేరుతో ఉంటుంది. అలాగే, Google cloud platform (GCP) లో చూస్తే Google Compute Engine అనేపేరుతో లభిస్తుంది. పేరేదైనా మనకి వచ్చే సర్వీస్ ఒకటే, బిల్ విషయంలో కొన్ని తేడాలు ఉండవచ్చు. కానీ సర్వీస్ ఒకటే.